వైకాపా బందరు రోడ్డుకు వచ్చేస్తోంది

238

ఎట్టకేలకు వైకాపా తాత్కాలిక కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి దగ్గరవుతున్నది. ఇప్పటివరకూ బంజారాహిల్స్‌ లోటస్‌ పాండ్‌లోని జగన్‌ నివాసంలోనే కీలకమైన చర్చలూ నిర్ణయాలూ జరిగేవి. ఇకపై ఆ చర్చలు విజయవాడ బందరు రోడ్డుకు చేరుతున్నాయి. బందరురోడ్‌లో తెలుగుదేశం కార్యాలయం సమీపంలోనే వైకాపా కార్యక్షేత్రం రానుంది.

హైదరాబాదులో జగన్‌ నివాసం, సాక్షి కార్యాలయం ఉండటం, కేసులు, చర్చలు, రాయలసీమ జిల్లాలకు హైదరాబాదు దగ్గరగా ఉండటం వంటి కారణాలతో ఇప్పటి వరకూ వైకాపా కేంద్రం మాత్రం మారలేదు. అమరావతిలో స్థలం లీజుకు తీసుకోవాలనీ, కొనాలనీ చాలా ప్రతిపాదనలు వచ్చినా పెద్దగా ముందుకు నడవలేదు. ఈ పరిస్థితుల్లో బందరురోడ్డులో మాజీ మంత్రి పార్థసారథికి సంబంధించిన స్థలంలో వైకాపా కార్యాలయానికి కొద్ది మాసాల కిందట శంకుస్థాపన చేసి నిర్మాణం త్వరగా పూర్తి చేసారు.

అయితే ఈ ప్రారంభోత్సవంలో జిల్లా నాయకులే పాల్గొంటారట. నవంబరు నుంచి జగన్‌ పాదయాత్ర కూడా ప్రారంభం కానుంది. దీని సమన్వయం మొత్తం విజయవాడ నుంచే జరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యాలయంలో జగన్‌ కోసం ఒక ప్రత్యేక చాంబర్‌ ఏర్పాటు చేసారు. మొత్తానికి మూడేళ్ళ తర్వాత వైకాపా కార్యాలయంలో కదలిక వచ్చింది. వైసీపీ కార్యక్షేత్రం ఆంధ్రకు రావటం పార్టీ నాయకులు హర్షించే విషయమే.

ఇక జగన్ ఎక్కువ కాలం విజయవాడలోనే ఉంటే పార్టీ వర్గాల్లో ఉత్సాహం నిండుతుంది. పాదయాత్ర తరువాత జగన్ ఎక్కువ కాలం ఆంధ్రలో వైకాపా కార్యాలయంలోనే ఉంటారన్నమాట.