జమిలి ఎన్నికలకు వైకాపా సిద్ధం

23

భారతీయ జనతా పార్టీకి వైకాపా మరోసారి మద్దతుగా నిలబడింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశమవుతున్న జమిలి ఎన్నికలకు సంపూర్ణంగా మద్దతు తెలిపింది. ఈ విషయంపై అభిప్రాయాలు కోరిన లా కమిషన్ చైర్మన్ తో …వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి ఢిల్లీలో సమావేశమై అభిప్రాయాలను లేఖ రూపంలో వివరించారు.

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ విషయంలో లా కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. భాజపాకి అనుకూలంగా ఉన్న పార్టీలు ఇప్పటికే జమిలికి మద్దతు ప్రకటించాయి. కానీ మెజార్టీ పార్టీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. అకాలీదళ్, తెరాస, వైకాపా జమిలి ఎన్నికలను గట్టిగా సమర్థిస్తున్నాయి. మిగతా ప్రాంతీయ పార్టీలు మాత్రం దీనిని రాజకీయ ఎత్తుగడగా పేర్కొంటూ జమిలి తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కలిసే వస్తున్నాయి. కాబట్టి ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదన్న తెదేపా ముందస్తు జమిలికి మాత్రం నో చెప్పింది. ఇలాటి తరుణంలో వైకాపా ముందస్తు అయినా, సమయానికే అయినా జమిలికి సిద్ధమని లేఖ ఇచ్చింది. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు రెండు వేర్వేరు అభిప్రాయాలను లా కమిషన్ కు చెప్పాయి.

వాస్తవానికి డిసెంబర్లో లోక్ సభతో పాటు పదిహేను రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపి పాక్షిక జమిలీ నిర్వహించాలని 2024కి పూర్తి స్థాయి జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో కేంద్రం ఉంది. లా కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత దాని ప్రకారం  నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.