CM KCR: వచ్చే నెలలో వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు.. ఆ అంశమే కీలకం

CM KCR: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబరులో జరగనున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావులను ఆదేశించారు.

తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, టీఆర్ఎస్ నేతలు నిత్యం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం ఆంక్షల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని కేసీఆర్ స్వయంగా మంత్రులతో చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం పక్షపాత ధోరణితోపాటు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం, ఐటీ, ఈడీ దాడులపై రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది.

CM KCR: కౌంటర్‌కు సిద్ధమవుతున్న విపక్షాలు..
సీఎం కేసీఆర్ చెబుతున్నట్టు ఆ 40 వేల కోట్ల అంశం ఆదాయం తగ్గడం కాదని విపక్ష నేతలు అంటున్నారు. అవి రాష్ట్రానికి ఇచ్చే అప్పుల విషయమని చెబుతున్నారు. ఇప్పటికే గ్యారెంటీ రుణాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం దివాలా తీసే ప్రమాదం ఉంటుందని గ్రహించి కేంద్ర ప్రభుత్వం అప్పుల విషయంలో షరతులు విధిస్తోందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

ఏది ఏమైనా తెలంగాణకు ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు తగ్గట్టుగా రుణాలు అందడం లేదు. ఎఫ్‌ఆర్‌బి‌ఎం పరిమితికి మించి అదనంగా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అప్పుచేసింది. అయితే వీటిని కూడా రాష్ట్ర అప్పుగా పరిగణిస్తామని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా తెలంగాణకు అప్పులు తెచ్చుకునే అవకాశం ఇవ్వాలని, లేకుంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని రాష్ట్ర అధికారులు కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం అసలు అంగీకరించడం లేదు. ఈ వ్యవహారంపై లోతుగా అసెంబ్లీలో చర్చ జరగనుంది.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ప్రోరోగ్ కాకపోవడంతో ఆ సమావేశాలకు కొనసాగింపుగానే డిసెంబరు సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఇక్కడి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆ అంశంపైనే దృష్టి పెట్టాయి.

Similar Articles

Comments

తాజా వార్తల