Uma Telugu Traveller: ఎనిమిదో తరగతి చదివి నెలకు ౩ లక్షలు సంపాదన.. తెనాలి యువకుడి వీరగాధ!

Uma Telugu Traveller: ఓ తెలుగు కుర్రాడి వీర గాథ ఇది. కేవలం ఎనిమిదో తరగతి చదివిన మాలెంపాటి ఉమాప్రసాద్‌ అనే యువకుడు.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెంట్‌ సెట్టర్‌గా మారాడు. తన ఉమా తెలుగు ట్రావెలర్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు. కేవలం 18 నెలల కాలంలోనే 20 దేశాలను చుట్టేశాడు. పలు దేశాల్లో గ్రామాలు, అక్కడి గిరిజనుల జీవన స్థితిగతులను పరిశీలించి వాటిని తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందిస్తున్నాడు.

ఇప్పటి వరకు సుమారు 340 వీడియోలు తీసిన ఇతడు.. 7 లక్షల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. 115 మిలియన్ల వ్యూస్‌ సాధించాడు. రాబోయే ఎనిమిదేళ్లలో 197 దేశాలను చుట్టి ఆయా దేశాల వింతలన్నీ తెలుగు ప్రజలకు అందించాలని కంకణం కట్టుకున్నాడు. ఈ యువకుడు.. నెలకు సుమారు మూడు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు. కృష్ణా జిల్లా మూలపాలెంలో ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెందిన మాలెంపాటి రామశేషయ్య, నాగమల్లేశ్వరిల కుమారుడే ఉమాప్రసాద్‌.

ఇతడికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయి. ఈ నేపథ్యంలో ఉమాప్రసాద్‌ కుటుంబం తల్లి నాగమల్లేశ్వరి పుట్టినిల్లయిన తెనాలి సమీపంలోని బూతుమల్లికి వచ్చి స్థిరపడింది. తెనాలిలో 8వ తరగతి వరకు చదివిన ఉమాప్రసాద్.. అంతటితో చదువును ఆపేశాడు. కుటుంబానికి సాయపడేందుకు ఫ్యాన్సీ షాపులో పనికి చేరాడు. రోజుకు 20 రూపాయల కూలి తెచ్చేవాడు.

మాలిలో మలుపు తిరిగింది..
తర్వాత చిన్నా చితకా పనులు, ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్‌, అసోంలో పలు రకాలు పనులు.. ఇలా సాగింది అతడి కెరీర్‌. చివరకు సెక్యూరిటీ కంపెనీలో 18 వేల జీతానికి చేరగా నాలుగేళ్లకు జీతం రూ.25 వేలు అయ్యింది. ప్రపంచ దేశాలు చుట్టేయాలనేది అతడి చిన్ననాటి కల. దీన్ని నెరవేర్చుకోవడానికి యూట్యూబ్‌లో ట్రావెల్స్‌ వీడియోలు చూస్తుండేవాడు. ఇలా సుమారు లక్షన్నర పోగేసుకొని తొలిసారి నేపాల్‌కు బయల్దేరాడు. వివిధ ప్రమాణమార్గాల్లో అక్కడికి చేరాడు. తర్వాత వెనక్కి వచ్చాడు. బంధువుల్లో ఒకరు దక్షిణాఫ్రికాలోని మాలిలో ఉద్యోగం ఉందని.. నెలకు రూ.30 వేలు జీతం ఇస్తారని చెప్పటంతో 2019లో మాలి చేరుకున్నాడు. ఇక్కడి నుంచే అతడి కెరీర్‌ మలుపు తిరిగింది. వీడియోలు తీయడం మొదలు పెట్టి సక్సెస్‌ అవుతూ వస్తున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్‌ చానల్‌ ద్వారా నెలకు రూ.3 లక్షలకు పైగా ఆదాయాన్ని అతడు అర్జిస్తున్నాడు.

Similar Articles

Comments

తాజా వార్తల