జార్ఖండ్: లీటరు పెట్రోలుకు రూ.25 తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. సబ్సిడీ నిబంధనలు ఏంటంటే..

ఝార్ఖండ్‌లో పేదలకు లీటరు పెట్రోల్ రూ.25 తక్కువగా లభించబోతోంది. రేషన్ కార్డు ఉంటే చాలు వారు తమ ద్విచక్ర వాహనాలకు తక్కువ ధరకు పెట్రోల్ కొట్టించుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి నెలకు ఇలా గరిష్టంగా 10 లీటర్ల పెట్రోల్ మాత్రమే పోయించుకోవచ్చు.

అంటే, నెలకు ఒక వ్యక్తి 250 రూపాయలు ఆదా చేయగలుగుతారు. ఆ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.

ఈ ప్రకటన చేసిన ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దేశంలో పెట్రోల్ ధరల్లో భారీ తగ్గింపు ప్రకటించిన తొలి ముఖ్యమంత్రిగా నిలిచారు. అయితే ఈ లబ్ధి పొందాలంటే కొన్ని షరతులు కూడా ఉన్నాయి.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైన సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ ప్రకటన చేశారు. చాలా తక్కువ సమయంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, కొత్త ఏడాదిలో జనవరి 26 నుంచి ఈ పెట్రోల్ ధర తగ్గింపు ప్రయోజనం పొందవచ్చని అన్నారు.

“దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పేదలు,మధ్యతరగతిపై దారుణంగా ప్రభావం పడుతోంది. పెద్ద పెద్ద వాహనాల్లో, కార్లలో తిరిగేవారికి దీనివల్ల ఏ సమస్యా లేదు. వాళ్ల జేబు నుంచి రూ.100- రూ.50 పోయినా వాళ్లకు పెద్దగా తేడా ఉండదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు మోటార్ సైకిల్లో కూడా సగం పెట్రోల్, సగం కిరోసిన్ నింపి నడుపుతుంటారు. ఫలితంగా కొన్ని రోజులకు వాళ్ల బండ్లే ఎందుకు పనికిరాకుండా పోతుంటాయి” అన్నారు సోరెన్.

“అలాంటి వారికి ఈ సమస్య నుంచి ఉపశమనం అందించాలనే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. మన వనరులు పెరిగేకొద్దీ, వారికి ఇచ్చినట్లే రాష్ట్ర ప్రజలకు కూడా ఈ తగ్గింపు అందించడానికి కృషి చేస్తాం” అన్నారు.

కేంద్రం గత నవంబర్‌లో ఎక్సజ్ డ్యూటీ తగ్గించి పెట్రోల్‌పై రూ.5, డీజిలుపై రూ.10 తగ్గించిన తర్వాత 20కి పైగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించాయి. పెట్రో ధరల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం అందించాయి. కానీ, ఇవన్నీ ఝార్ఖండ్‌ తగ్గించిన మొత్తంలో సగం కంటే తక్కువే తగ్గింపే ఇచ్చాయి.

ఝార్ఖండ్‌ ఇప్పుడు ఒక పెద్ద జనాభా లీటరు పెట్రోల్‌ను రూ.25 తక్కువకే కొనుగోలు చేసే తొలి రాష్ట్రం కాబోతోంది.

రేషన్ కార్డు ఉండి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి, వ్యవసాయంతోపాటూ ఇతర అవసరమైన పనులు తిరగడానికి ఈ తగ్గింపు అందిస్తున్నట్లు హేమంత్ సోరెన్ చెప్పారు.

అయితే, ఆయన ప్రకటన తర్వాత దారిద్ర్యరేఖ(బీపీఎల్)కు దిగువన ఉండేవారికే ముఖ్యమంత్రి ఈ ఉపశమనం అందించారనే గందరగోళం వ్యాపించింది.

మీడియాలో కూడా ఇలాంటి వార్తలే రావడంతో, ఒక వ్యక్తి దారిద్ర్య రేఖకు కిందుంటే, అతడి దగ్గర బైక్ ఎలా వస్తుందని, వారు బీపీఎల్ ఎలా అవుతారని.. సోషల్ మీడియాలో ప్రశ్నలు గుప్పించడం మొదలుపెట్టారు.

Similar Articles

Comments

తాజా వార్తల